STAGING — signals: env, home

కేసీఆర్‌కు ఎప్పుడెప్పుడు ఓటు వేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు: కేటీఆర్‌

ఈ వార్తను షేర్ చేయండి:

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో ఆగ్రహం.. బీఆర్‌ఎస్‌ వైపు అన్ని వర్గాలు చూస్తున్నాయి

హైదరాబాద్‌,అక్టోబర్ 23(తెలంగాణ గర్జన): గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవలేదని, అడ్డమైన మాటలు, తప్పుడు ప్రచారంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం అంబర్‌పేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, పాలన చేతకాక ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు.

ఎల్‌నినోపై ముందస్తు హెచ్చరికలను పట్టించుకోలేదు

ఎల్‌నినో ప్రభావంపై పది నెలల ముందే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

మేడిగడ్డపై తప్పుడు ప్రచారం చేశారు

కాళేశ్వరం పంపులు ప్రారంభిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని ప్రారంభించలేదని కేటీఆర్‌ ఆరోపించారు. మేడిగడ్డ కూలిపోయిందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసిందని, రాహుల్‌గాంధీతోనూ అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు. రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో ఒక్కటవుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని అన్నారు.

దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తారు

దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీల కూటములు కీలకంగా మారే రోజులు దగ్గరలో ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. నాలుగేళ్ల క్రితం కేసీఆర్‌ ప్రతిపాదించిన కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఆలోచనను చాలామంది అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న బీజేపీకి, సమర్థవంతమైన ప్రత్యామ్నాయ ఎజెండా లేని కాంగ్రెస్‌కు మధ్య ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్‌, కాంగ్రెస్‌ వైఫల్యాల కారణంగానే యువత బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకులను బీజేపీ బెదిరించగలిగినా యువతను బెదిరించలేదని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత బలహీన స్థితికి బీజేపీ చేరుకుందని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేసీఆర్‌, కేటీఆర్‌లను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ భయపడుతోంది

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించే ధైర్యం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని కేటీఆర్‌ విమర్శించారు. కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తే 2017లో సాధించిన విజయాల తరహాలోనే బీఆర్‌ఎస్‌ మళ్లీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి ఎన్నికల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ధనబలాన్ని మాత్రమే నమ్ముకుందని, యూత్‌ డిక్లరేషన్‌ పేరుతో విద్యార్థులు, నిరుద్యోగులు, యువతను మోసం చేసిందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *